తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక పోస్టుల్లో మార్పులు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పరిపాలనలో కీలక శాఖలు, ముఖ్యమైన పదవుల్లో పలువురు సీనియర్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది.
ఈ నెలాఖరుతో చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించింది. సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న అజిత్ రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా బదిలీ చేయగా, ఎన్. శ్రీధర్‌ను ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమించింది.
అదేవిధంగా శైలజా రామయ్యర్‌కు అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, అహ్మద్ నదీమ్‌కు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (పాలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. రాహుల్ బొజ్జాకు విపత్తుల నిర్వహణ శాఖ, ఎం. రఘునందన్ రావుకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.
పి. కాత్యాయని దేవిని హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ స్పెషల్ సెక్రటరీగా, కె. గంగాధర్‌ను ఆర్&బీ స్పెషల్ సెక్రటరీగా నియమించింది. టి. వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా, కె. విద్యాసాగర్‌ను టూరిజం డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ బదిలీలతో రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న అధికారులు తమ తమ శాఖల్లో త్వరలో విధుల్లో చేరనున్నారు.
