మోదీ కేబినెట్లో భారీ మార్పులు?.. ఈ వారమే పునర్వ్యవస్థీకరణకు అవకాశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తన కొత్త జాతీయ కార్యవర్గాన్ని తుది దశలో సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రివర్గంలోనూ మార్పులు ఉండొచ్చని సమాచారం. ఇటీవల ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును వరుసగా కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
కొంతమంది కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవీకాలం ముగియడం, మరికొందరికి పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించడం వల్ల ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో కొత్త ముఖాలకు అవకాశం లభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే కీలక రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ సమతుల్యత, మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులు ఉండవచ్చని సమాచారం.
అయితే కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
