“నా భర్త కంటే మీరంటే ఎక్కువ ఇష్టం”.. అభిమానికి షారుఖ్ ఖాన్ చమత్కార సమాధానం వైరల్
మంగళూరు: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మరోసారి తన హాజరుజవాబుతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. మంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఓ మహిళా అభిమాని “నా భర్త కంటే మీరంటే నాకు ఎక్కువ ఇష్టం” అని చెప్పగా, షారుఖ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అభిమాని మాటలు విన్న షారుఖ్ చిరునవ్వుతో, “ఇలాంటి విషయాలు ఇలా అందరి ముందుకాకుండా ఒంటరిగా చెప్పాలి కదా!” అంటూ చమత్కరించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం ఆమె భావాలను గౌరవిస్తున్నానని, “మీ భావాలు నాకు అర్థమయ్యాయి. మీ భర్తకు కూడా అర్థమవుతాయని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని, మీ భర్తను, మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను” అంటూ హృదయపూర్వకంగా స్పందించారు.
షారుఖ్ ఖాన్ సరదా సమాధానంతో పాటు అభిమానిపై చూపిన గౌరవప్రదమైన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, “కింగ్ ఖాన్ స్టైల్ ఇదే” అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
