ఈక్వెడార్‌లో జాతీయ సెలవు ప్రకటించిన అధ్యక్షుడు.. ప్రపంచకప్ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు
క్విటో: ఫిఫా ప్రపంచకప్-2026లో ఈక్వెడార్ జట్టు చారిత్రక విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు డానియెల్ నొబోవా జాతీయ సెలవు ప్రకటించారు. జర్మనీపై 2-1 తేడాతో సంచలన విజయం సాధించిన జట్టుకు అభినందనలు తెలుపుతూ దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
గ్రూప్-ఈలో తొలి రెండు మ్యాచ్‌లలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో చివరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో బరిలోకి దిగిన ఈక్వెడార్, బలమైన జర్మనీని వెనుక నుంచి పుంజుకుని ఓడించింది. ఈ విజయంతో అత్యుత్తమ మూడో స్థానంలో నిలిచిన జట్లలో ఒకటిగా నాకౌట్ దశకు అర్హత సాధించింది.
విజయం అనంతరం అధ్యక్షుడు నొబోవా సోషల్ మీడియాలో స్పందిస్తూ, “విమర్శలను తట్టుకుని దేశానికి అపారమైన ఆనందాన్ని అందించిన ఆటగాళ్లు, కోచ్‌కు ధన్యవాదాలు. రేపు జాతీయ సెలవు” అని ప్రకటించారు. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
ప్రపంచకప్ చరిత్రలో ఈక్వెడార్ నాకౌట్ దశకు చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2006 తర్వాత మళ్లీ ఈ ఘనత సాధించడంతో ఈ విజయం దేశ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్మరణీయ విజయంగా నిలిచింది.
