పంట పొలాల్లో ఒరిగిన 33 కేవీ విద్యుత్ స్తంభం
రైతుల ప్రాణాలకు తీవ్ర ముప్పు!
అక్బరుపేట/భూంపల్లి, మే 25 (ఆశ్వి అప్డేట్స్):
పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు కిందికి వంగి, హైటెన్షన్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నప్పటికీ, పంట పొలాల్లోనూ ఒరిగిన 33 కేవీ విద్యుత్ స్తంభం మరమ్మత్తుల విషయంలో విద్యుత్ అధికారులు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు గుండెల్లో గుబులు పెట్టుకొని పొలాల్లో పనులు చేసుకుంటున్నారు.
*నిర్లక్ష్యానికి నిలువుటద్దం..*
అక్బరుపేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు ఆరుగొండ జయరాములు పొలం వద్ద ఉన్న 33 కేవీ విద్యుత్ స్తంభం భూమిలోకి బాగా ఒరిగిపోయింది. దాంతోపాటు భారీ విద్యుత్ వైర్లు సైతం కిందికి వేలాడుతున్నాయి. ఈ దారుణ పరిస్థితి కళ్లముందే కనిపిస్తున్నా, విద్యుత్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
*రైతుల ఆందోళన*
వైర్లు చాలా కిందికి ఉండటంతో పొలాల్లోకి వెళ్లడానికే భయమేస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఏమాత్రం తేడా వచ్చినా భారీ ప్రాణ నష్టం జరుగుతుంది.
*నాలుగు గ్రామాలకు నిలిచిపోనున్న విద్యుత్ సరఫరా
ఒకవేళ ఈ 33 కేవీ లైన్‌కు ప్రమాదం జరిగి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, ఒక్క వీరారెడ్డిపల్లి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరికొన్ని గ్రామాలపై తీవ్ర ప్రభావం పడనుంది.ఖాజీపూర్,వీరారెడ్డిపల్లి,జంగపల్లి,అల్మాజిపూర్ఈ నాలుగు గ్రామాలకు పూర్తిగా కరెంట్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించాలి
విద్యుత్ శాఖ అధికారుల ఘోర నిర్లక్ష్యం వల్లే నేడు ఈ దుస్థితి నెలకొందని స్థానిక రైతాంగం ఆరోపిస్తోంది. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోకముందే.. అధికారులు తక్షణమే స్పందించి, ఒరిగిన విద్యుత్ స్తంభాన్ని నిటారుగా నిలబెట్టాలని, వేలాడుతున్న వైర్లను సరిచేసి తమ ప్రాణాలను, పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
