హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల అర్ధరాత్రి చర్యలు కలకలం.. జర్నలిస్టు కేవీఆర్ అరెస్టుపై వివాదం
హైదరాబాద్: హైదరాబాద్‌లో సీనియర్ జర్నలిస్టు కే. వెంకట్రామ్‌రెడ్డి (కేవీఆర్)ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకెళ్లిన ఘటన వివాదానికి దారితీసింది. ఏపీ పోలీసులు సివిల్ డ్రెస్సులో వచ్చి కేవీఆర్‌ను అరెస్టు చేశారని, ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
జర్నలిస్టు కేవీఆర్‌ను ఏపీకి చెందిన ఓ కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్టు సమయంలో స్థానిక పోలీసుల సమక్షంలో జరిగిన వ్యవహారం, మహిళా పోలీసుల గైర్హాజరు, కుటుంబ సభ్యుల అభ్యంతరాలు వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై తెలంగాణకు చెందిన పలు జర్నలిస్టు సంఘాలు, సామాజిక సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అరెస్టు విధానంపై విచారణ జరపాలని కోరుతున్నాయి. మరోవైపు, కేవీఆర్ భార్య సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
